
- సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.11 వేల కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు రూ.200 కోట్లు చొప్పున మంజూరు చేస్తూ జీవో విడుదల చేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నియోజకవర్గాల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ఉండటం సంతోషకర మన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించనున్నాయని మంత్రి పొన్నం చెప్పారు.