
సిద్దిపేట: రాజకీయ వికృత చేష్టలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట టౌన్ లో మార్నింగ్ వాక్ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈ సర్కార్ ఎక్కువ రోజులు నడువదు అని కడియం శ్రీహరి లాంటి వాళ్లు అంటున్నరు.
బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఇలా మాట్లాడవచ్చా..? ప్రజలు తీర్పు ఇచ్చారు.. ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎవరు బయటకు వెళ్లాలని ఆలోచన కూడా చేయరు. ప్రతిపక్షాల మైండ్ సెట్ మారాలి. నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలి. ప్రొటెం స్పీకర్ విషయంలో రాజాసింగ్ రాద్ధాంతం చేయడం తగదు. కాంగ్రెస్ ప్రభుత్వం కా జవాబ్ పత్తర్ సే దేతే అని సమాధానం చెప్పేందుకు రెడీ’ అని పొన్నం తెలిపారు.