తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్సే : పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఆకాంక్షను  నెరవేర్చింది కాంగ్రెస్సే : పొన్నం ప్రభాకర్
  • ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాపాలన: మంత్రి పొన్నం 
  • నిజాం నుంచి విముక్తి లభించిన రోజు: మంత్రి దామోదర
  • అర్హులైన ప్రతీ రైతుకు పట్టా పాస్​బుక్: కోదండరెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో అంతర్భాగం అయిందన్నారు. అనంతరం పెద్ద మనుషుల ఒప్పందంతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైనా దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే వంట గ్యాస్, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ప్రతి నియోజక వర్గంలో 3500 గృహాలను నిర్మిస్తున్నామని, రుణమాఫీలో భాగంగా జిల్లాలో అర్హులైన లక్షా 2 వేల 75 మంది రైతులకు రూ.839 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 18 వేల 788 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.165 కోట్లతో జీవనోపాధులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, సీపీ అనురాధ, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మెదక్​లో..

మెదక్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్​బుక్​అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్​చైర్మన్​కోదండరెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్​ కలెక్టరేట్​వద్ద ఉన్న అమర వీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ప్రభుత్వం భూ ప్రక్షాళన చేపట్టి, ధరణి పోర్టల్​తెచ్చిన తర్వాత తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న 25 లక్షల ఎకరాలను పార్ట్ బీలో పెట్టిందన్నారు. దీంతో లక్షలాది మంది రైతులు భూమిపై హక్కులు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

రైతుల తిప్పలు స్వయంగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై కమిటీ వేయడంతోపాటు, అర్హులైన రైతులందరికీ హక్కులు కల్పించాలని క్యాబినెట్​లో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కలెక్టర్లు విచారణ జరిపి భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్​బుక్ లు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనపై దృష్టి పెట్టి ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.

 జిల్లాలో ఇప్పటి వరకు 1.31 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారని, రాజీవ్​ఆరోగ్య శ్రీ పథకం కింద 10 వేల 722 మంది చికిత్సలు పొందారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్​రావు, కలెక్టర్​రాహుల్​రాజ్, ఎస్పీ ఉదయ్​కుమార్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు, అడిషనల్​ఎస్పీ మహేందర్,  మున్సిపల్ చైర్మన్​ 
చంద్రపాల్​పాల్గొన్నారు. 

సంగారెడ్డిలో..

సంగారెడ్డి టౌన్ : నిజాం నుంచి విముక్తి లభించి స్వపరి పాలనలోకి వచ్చిన సందర్భంగా  సెప్టెంబర్​17 ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పాటిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేడు ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యం సొంతం కావడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు.  ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో 1969లో మొదలైన ఆత్మగౌరవ పోరాటం సుధీర్ఘంగా కొనసాగిందన్నారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షను గమనించిన కాంగ్రెస్​అధినేత సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిదన్నారు. ప్రజలు కన్న కలలను సాకారం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.