
- బీజేపీలోని బీసీ నేతలు బండి, ఈటల, లక్ష్మణ్ కలిసి రావాలి: పొన్నం ప్రభాకర్
- రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా రాజకీయ స్ఫూర్తి రావాలి
- హెచ్సీయూ భూములను సర్కారు గుంజుకోవడం లేదని వెల్లడి
- కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో సన్న బియ్యం పంపిణీ చేసిన మంత్రి
కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును పార్లమెంట్ లో కూడా ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి చేసేందుకు రాష్ట్రానికి చెందిన అన్ని బీసీ సంఘాలు ఢిల్లీ కేంద్రంగా బుధవారం ధర్నా నిర్వహిస్తున్నాయని.. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు, జాతీయ పార్టీల ముఖ్యనేతలు పాల్గొంటున్నారని వెల్లడించారు.
మంగళవారం కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో, సిరిసిల్లలో మంత్రి సన్న బియ్యంను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ లాంటి బీసీ నాయకులను కలిసి రాష్ట్రం తరఫున సహకరించాలని అడుగుతామని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులం అన్ని పార్టీల నాయకులను కలుస్తామని వెల్లడించారు. ఈ చట్టం దేశానికి దిక్సూచి అన్నారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహా రాజకీయ స్ఫూర్తి రావాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఈ బిల్లును ఆమోదించుకోవాలని కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగే ధర్నాకు తనతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలువిద్యార్థులను రెచ్చగొడుతున్నరు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తరచూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకుంటున్నట్టు ఆరోపిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. హెచ్సీయూ భూములను ప్రభుత్వం గుంజుకోలేదని.. 2004 నుంచి చేస్తున్న న్యాయ పోరాటంలో 400 ఎకరాల స్థలం కోర్టు ద్వారా ప్రభుత్వానికి అందిందన్నారు. తానూ విద్యార్థి నాయకుడినేనని, పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. దేశంలో ప్రభుత్వ సంస్థలను కేంద్రమే అప్పనంగా అమ్మేస్తోందని పొన్నం విమర్శించారు.
కేసీఆర్ ప్రతిపాదించిన వ్యక్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని, కిషన్ రెడ్డి కన్ఫ్యూజన్, కాంట్రవర్సీ తో లాభం పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను కాపాడుకుంటామని పొన్నం స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలనా దక్షత వల్ల హైదరాబాద్ కు ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నారు. హెచ్సీయూ సమీప స్థలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రాజపుష్ప, మై హోమ్ రామేశ్వరరావు ఐలాండ్ లు కట్టి రేపు అమ్ముకోకుండా ఇబ్బందులు అవుతాయేమోనని రాజకీయం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు.