వైద్యం పట్ల గౌరవం పెరిగేలా పనిచేయాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్

వైద్యం పట్ల గౌరవం పెరిగేలా పనిచేయాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట రురల్, వెలుగు: వైద్యం పట్ల గౌరవం పెరిగేలా పట్టాలు అందుకున్న డాక్టర్లు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని సురభి మెడికల్ కాలేజ్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం లో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.

ప్రతిరోజు తన వద్దకు అనారోగ్య సమస్యలతో ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్​వోసీల కోసం వస్తున్నారని అలాంటి వారికి వైద్య సేవలందించాలని సూచించారు. పట్టాలు అందుకున్న 117 మంది డాక్టర్లు సిద్దిపేట ప్రాంత పేరును నిలబెట్టాలన్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ స్టూడెంట్స్​గా అడుగుపెట్టి డాక్టర్లుగా బయటకు వెళ్తున్న మీరు సమాజంలో మంచి పేరు తీసుకురావాలని, మంచి డాక్టర్లుగా ఎదగాలన్నారు. సురభి యాజమాన్యం దుబ్బాక ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ కానీ పీజీ మెడికల్ కాలేజ్ గాని ఏర్పాటుచేయాలన్నారు.

ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో 29 వైద్య కాలేజీలను తీసుకువచ్చామని, ఎల్​కేజీ ఫీజుతో సమానంగా రూ.10 వేలకే ఎంబీబీఎస్ సీటును ఇచ్చామని గుర్తుచేశారు. డబ్బు కంటే ప్రాణానికి విలువ ఎక్కువని,  జీవితంలో మిగిలిపోయేది పేరు మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ పీవీ నందకుమార్ రెడ్డి, సురభి కాలేజ్ చైర్మన్ హరిందర్ రావు, డైరెక్టర్లు మనోహర్ రావు, మహేందర్ రావు, డీన్ రఫీ పాల్గొన్నారు.