డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నచోట్ల కాంగ్రెస్ ఓట్లు ఆడగదని.. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నచోట బీఆర్ఎస్ ఓట్ల అడగదంటూ సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏప్రిల్ 10వ తేదీ మంగళవారం రోజున కొండగట్టు అంజన్నను దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కాగా అమలు చేసి తీరుతుందని చెప్పారు.
కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లలో కేసీఆర్, వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నడూ కారులోంచి కాలు కింద పెట్టని వినోద్ కుమార్... ఇవాళ మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను ప్రజలను మోసం చేస్తున్నారని పొన్నం విమర్శించారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పారు. కొండగట్టు అంజన్న సన్నిధి నుండే ఎన్నికల పోరును ప్రారంభిస్తున్నానని తెలిపారు. బండి సంజయ్, వినోద్ కుమార్ లు అబద్దాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని హితవు పలికారు.