భీమదేవరపల్లి/హుస్నాబాద్ : ప్రాజెక్టులపై వాస్తవాలు చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం డిజిటల్ హంగులు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర, ముత్తారం గ్రామంలోని కైలాస కళ్యాణి క్షేత్రం, త్రికూటేశ్వరాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో నేడు నీళ్లు లేకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో ఒక యాత్ర నిర్వహిస్తున్న నాయకుడు మమ్మల్ని నాస్తికులుగా పోలుస్తున్నాడని, దేవుని పేరుతో రాజకీయం చేసేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
ALSO READ :-మీ టికెట్ మాకొద్దు: మాజీ మంత్రి మల్లారెడ్డి
ఎంపీగా ఉండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావని, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది ఆయనేనని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రాం ప్రారంభిస్తామన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రూ.2కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఫ్రీ జర్నీ కోసం నెలకు రూ.350 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సీఎంతో చెప్పి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్స్ ఇష్యూ చేస్తామన్నారు.