పాల సేకరణ మాదిరిగానే కల్లు సేకరణ జరగాలి: పొన్నం ప్రభాకర్‌‌‌‌

కరీంనగర్/సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : గీత వృత్తికి గౌరవం తీసుకురావాలని, గౌడ కులస్తుల విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల విషయంలో తన తోడ్పాటు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. పాల సేకరణ మాదిరిగానే, స్వచ్ఛమైన కల్లు సేకరణ కూడా జరగాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ బొమ్మకల్‌‌‌‌ బైపాస్‌‌‌‌ రోడ్డులోని వీ కన్వెన్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో మంత్రిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ ఉద్యమంలో గానీ, రాజకీయ రంగంలో గానీ ధైర్యంగా పోరాడానని గుర్తు చేశారు.

వేములవాడ, కొమురవెల్లిలో గౌడ సత్రాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. బూరుగు సత్యనారాయణగౌడ్‌‌‌‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడ జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, నాయకులు పల్లె లక్ష్మణ్‌‌‌‌గౌడ్‌‌‌‌, రాచకొండ తిరుపతి, రిటైర్డ్ డీసీపీ సుదర్శన్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌, చంద్రశేఖర్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఎలిగేడు మండల కేంద్రంలో సీపీఐ నేత కొండయ్య గౌడ్‌‌‌‌ ఫ్యామిలీని మంత్రి పరామర్శించారు. కొండయ్య గౌడ్‌‌‌‌ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.