హైదరాబాద్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఇమేజ్​ను దెబ్బతీస్తే ఊకోం :  మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఇమేజ్​ను దెబ్బతీస్తే ఊకోం :  మంత్రి పొన్నం ప్రభాకర్
  • రాజకీయ కక్షతో కేసు పెట్టలేదు: పొన్నం  
  • ఫామ్ హౌస్ లో విదేశీ మద్యం దొరికిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఎవరు విమర్శించినా ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కొందరు సిటీ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లలో పార్టీలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతినేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో మద్యనిషేధం అమల్లో లేదని, కానీ ఫంక్షన్ చేసుకుంటే ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘స్థానికుల ఫిర్యాదు మేరకే రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ అనుమతి లేని విదేశీ మద్యం దొరికింది. ఒకరు డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగానీ రాజకీయ కక్షతో ఎవరి మీద కేసు పెట్టలేదు” అని చెప్పారు.

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై మండిపడ్డారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉంటాయి. కానీ జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉండవు. బట్ట కాల్చి మీద వేయడం సరైంది కాదు” అని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పోలీసుల మనోస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన వైఖరి చెప్పాలన్నారు. ఫామ్ హౌస్ పార్టీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.