ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర: మంత్రి పొన్నం

ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర: మంత్రి పొన్నం

 

  • ప్రాంతీయ విభేదాలు బీఆర్​ఎస్​ రెచ్చ గొడుతున్నది: మంత్రి పొన్నం
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది
  • ప్రజలు ఆందోళన చెందొద్దని సూచన

హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు:రాష్ట్రంలో కొందరు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని..ఇది అసెంబ్లీ సమావేశాలు సమయంలో కూడా చెప్పా ము అని మంత్రి తెలిపారు.  శుక్రవారం మినిష్టర్  క్వాటర్స్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని, పోలీసులు అలెర్ట్ గా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, ఫ్రెండ్లీ గా పోలీసులు పని చేస్తున్నారని ఆయన అన్నారు.  నేతల హౌస్ అరెస్ట్ ల గురుంచి బీఆర్ఎస్​కు మాట్లాడే అర్హత లేదన్నారు. గత  పదేండ్లు ఏ మంత్రి జిల్లాకు వెళ్లినా.. ముందు రోజు హౌస్ అరెస్ట్ లు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ అని ప్రజల్లో ఇబ్బందులు సృష్టించవద్దని, హైదరాబాద్ పేరును చెడగొట్టొద్దని ఆయన సూచించారు.

హైదరాబాద్ ఇమేజ్​ దెబ్బతీస్తే సహించం 

హైదరాబాద్ ఇమేజ్ ను​దెబ్బతీస్తే సహించమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాద్  ఐక్యతకు ప్రతీక అని.. పండుగల నేపథ్యంలో ఎవరైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. లక్డీకపూల్​లోని హైదరాబాద్ ​కలెక్టరేట్ కాన్ఫరెన్స్​హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,  సీపీ సీవీ ఆనంద్ తో కలిసి మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. 

సెప్టెంబర్17న  నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టేలా, అపోహలు సృష్టించేలా పోస్టులు పెట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. 

ఈ నెల 16న నిర్వహించే మిలాద్​ఉన్​నబీ పండుగను ముస్లిం మత పెద్దలు 19న నిర్వహించుకుంటామని అంగీకరించారని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని, ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. 

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..నిమజ్జనం సందర్బంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.  జంట నగరా ల్లో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.