బీసీ కులగణన సర్వేతోనే బడుగులకు ఎమ్మెల్సీ స్థానాలు : మంత్రి పొన్నం

బీసీ కులగణన సర్వేతోనే బడుగులకు ఎమ్మెల్సీ స్థానాలు : మంత్రి పొన్నం
  • మంత్రి పొన్నం ప్రభాకర్​ 

వేములవాడ, వెలుగు: బీసీ కులగణన ఎఫెక్ట్​తోనే ఎమ్మెల్సీ స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించారని, దీనిని బీసీ మంత్రిగా స్వాగతిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.  రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలు ఏవైనా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం, ప్రోత్సాహంతో భవిష్యత్​లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు చదువుకునే యంగ్  ఇండియా రెసిడెన్షియల్  స్కూల్స్  కోసం రూ.11 వేల కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్  స్కూల్స్  మంజూరు చేయడం విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం రూపొందించిన బీసీ సబ్  ప్లాన్ ను రాజకీయంగా ఉపయోగించుకోవాలన్నారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వేములవాడలో కొత్తగా నిర్మించిన రాజరాజేశ్వర గౌడ చారిటబుల్​ ట్రస్ట్​ను విప్​ ఆది శ్రీనివాస్​తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా, రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్, లైబ్రరీ చైర్మన్​ నాగుల సత్యనారయణ గౌడ్​ పాల్గొన్నారు.