హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 3) గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కుల గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 96 శాతం ఆర్థిక, సామాజిక సర్వే చేశామని చెప్పారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీల స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కుల గణనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే.. అది బలహీన వర్గాలపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కుల గణనను మేం పూర్తి చేశామని.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయనివాళ్లు ఇప్పుడు మమ్మల్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. కుల గణనపై ప్రతి పక్షాల విమర్శలను బీసీలపై దాడి గానే చూస్తామన్నారు. కుల గణనపై ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.
అన్ని వర్గాలకు ఫలితాలు అందేవరకు పోరాటం ఆగదన్నారు. కుల గణన సర్వేలో కేసీఆర్ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే అధికారులకు డిటైయిల్స్ ఇఛ్చారని తెలిపారు. కొన్నిచోట్ల కుల గణన కోసం అధికారులు వస్తే కుక్కలను వదిలారని ఆగ్రం వ్యక్తం చేశారు. సర్వేలో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. విజయవంతంగా కుల గణనను పూర్తి చేసిన ప్లానింగ్ కమిషన్.. ఈ రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది.
ALSO READ : పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్.. ఫిబ్రవరి 10న విచారణ
దీంతో రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు ఎంత శాతం ఉన్నారనేది తేలిపోయింది. కుల గణన నివేదికకు ఈ నెల 5వ తేదీన కేబినెట్, అసెంబ్లీ ఆమోదం తెలపనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణనపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. కుల గణన సర్వే సరిగ్గా నిర్వహించలేదని.. రిపోర్టు తప్పుల తడక అని ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో కుల గణన సర్వేపై ప్రతిపక్షాల వి మర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.