ఫుడ్ పాయిజన్ ఘటనలను రాజకీయం చేస్తే ఊరుకోం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం వార్నింగ్

సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‎కు గురై అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని.. గురుకులాలు, హాస్టళ్ల వద్ద రాజకీయం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాలు గురుకులాల సందర్శన చేయడం కాదని.. వాటిపై ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సూచించారు. 

శుక్రవారం (నవంబర్ 29) సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయాన్ని మంత్రి పొన్నం దర్శించుకుని.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల హాస్టల్‎లకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని.. అద్దె భవనాల బకాయిలు చెల్లించి కొత్త ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు. 

ALSO READ | గురుకులాల్లో కుట్రల వెనక RS ప్రవీణ్ కుమార్: మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టల్‎లకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించామని.. ఇకపై ఎవరైనా ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల హాస్టళ్లలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి కానీ.. జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకొస్తే శాఖపరమైన చర్యలు  తీసుకుంటామన్నారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నం.. ఏదేమైనా సర్వే విజయవంతంగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.