సిరిసిల్ల: రూ.2 లక్షల రైతు రుణమాఫీఫై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని.. అయితే, టెక్నికల్ ప్రాబ్లమ్ వలన అక్కడక్కడ కొంతమందికి మాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ కానీ రైతులకు డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని.. రైతులెవరూ అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. 2024, నవంబర్ 15న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని.. సిరిసిల్ల, వేములవాడలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ లోటు రాకుండా చూసుకుంటామన్నారు. ఎమ్మేల్యే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయని.. ఇక నెక్ట్స్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు. మా ఎన్నికలు అయ్యాయి.. ఇక మీ ఎన్నికలే మిగిలాయి.. మేము మీ వెంట ఉంటామని.. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, నిరసనలు చేయడానికి అవకాశం ఇచ్చాం.. కానీ అధికారులపై దాడులు చేయడానికి కాదని ఫైర్ అయ్యారు.
కలెక్టర్‌పై దాడి చేస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేయాలని ప్రశ్నించారు. మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టులలో ఏం జరిగిందో అందరికి తెలుసని.. మేం దెబ్బలు తిన్నాం కానీ తిరిగి దాడులు చేయలేదన్నారు. తమది చేతగాని ప్రభుత్వం కాదని.. మేమేంటో చేసి చూపిస్తామన్నారు. కార్యకర్తలకి కష్టం వస్తే మేము మీకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. నేతన్నలకి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని కలవండని అన్నారు. త్వరలోనే అన్ని పథకాలు ఇస్తాం.. కాస్త ఓపికగా ఉండండని అన్నారు.