హైదరాబాద్: భారీ వర్షాలు, విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని -మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి విలయ తాండవం చేస్తున్నప్పుడు మనమందరం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని తెలిపారు.
రాజకీయం చేసే వారు రాజకీయం చేస్తుంటారు.. ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదని.. దాని నుండి ఏవిధంగా తప్పించుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వం తరుఫున చెబుతున్నామన్నారు. నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలనే ప్రయత్నం చేస్తున్నామని.. ఇందుకు కేంద్రం నుండి కూడా సహకారం కోరామని తెలిపారు.
విపత్తు వేళ అధికారులంతా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి సహాయ కార్యక్రమాల్లో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కోరామని.. మేము కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన లో ఈ ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నానని వ్యాఖ్యానించారు.