నిమజ్జనం తర్వాత చూసుకుందాం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం స్వీట్ వార్నింగ్

నిమజ్జనం తర్వాత చూసుకుందాం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం స్వీట్ వార్నింగ్

కరీంనగర్: సెప్టెంబర్ 17, 18వ  తేదీ వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకున్నా.. కొట్లాడుకోవాలనుకున్నా వినాయక నిమజ్జనం తరువాత కొట్లాడుకుందామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వినాయక నిమజ్జనం ముగిసే వరకు అందరూ సంయమనంతో ఉండాలని.. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరిపాలన చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని.. ప్రతిపక్షాలు తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

 రేపు (సెప్టెంబర్ 16) కరీంనగర్‎లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం  మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వందలాది గణేష్ విగ్రహాలు మనకొండూరు, కొత్తపల్లి, చింతకుంట చెరువులో సోమవారం నిమజ్జనం జరుగుతాయని.. ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు అధికారులు  పూర్తి చేశారని తెలిపారు. 

హైదరాబాద్‎లో కూడా నిమజ్జనంపై ఎలాంటి సందేహం లేదు. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితితో మాట్లాడాం. ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‎లో భాగ్య నగర్, గణేష్ ఉత్సవ సమితి గతంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.. అయోమయం  అవసరం లేదన్నారు. 

Also Read :- వరద బాధిత పిల్లలకు నోటు బుక్స్ పంపిణీ

10 సంవత్సరాలు అధికారంలో అన్న వారు 10 నెలలోనే అసహనానికి గురై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం జరిగితే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అందరూ వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని కోరారు.