
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం (ఏప్రిల్ 18) రాత్రి దాదాపు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటి వెళ్లే సమయంలోనే సరిగ్గా వర్షం కురువడంతో రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్ భారీ వర్షం కురవడంతో పాటు మరోసారి వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహయక చర్యలపై రివ్యూ నిర్వహించిన పొన్నం.. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో పలుచోట్ల కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించాడు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
విద్యుత్ పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు. రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి చెప్పారు. హైదరాబాద్లో మరోసారి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమంగా ఉండాలని అధికారులకు సూచించారు. మళ్లీ భారీ వాన పడే ఛాన్స్ ఉండటంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.