కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా.. DNA పరీక్ష చేయించుకో: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా.. DNA పరీక్ష చేయించుకో: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

వరంగల్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. 2024, నవంబర్ 16న వరంగల్‎లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా.. ఒకసారి డీఎన్ఏ పరీక్ష చేసుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పిలుపునిచ్చిన ఒక రోజు మూసీ నిద్ర కార్యక్రమంపైన మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ డైరెక్షన్ మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని.. మూసీ నిద్ర కాదు ముందు మీ మొద్దు నిద్ర వీడండని ఎద్దేవా చేశారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకొచ్చే శక్తి నీకు లేదని కిషన్ రెడ్డిని విమర్శించారు. కలెక్టర్‎ను కొట్టిన వారిని సమర్ధించిన నువ్వు కేంద్ర మంత్రిగా అర్హుడివా అంటూ నిలదీశారు.

ఒక ఐఏఎస్ అధికారిపై దాడి జరిగితే కేంద్రమంత్రిగా ఖండించక పోగా సమర్థించడం బాధాకరమని అన్నారు. అధికారులను కొట్టినోన్ని.. కొట్టిచ్చినొన్ని వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పొన్నం. హైడ్రా, మూసీ, అధికారులపై దాడి ఘటనపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా నువ్వేం చేశావ్.. నేనేం చేశానో దమ్ముంటే బహిరంగ చర్చకు రా అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.