
- నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆఫీసర్లకు హెచ్చరిక
- జాతరకు 6 లక్షల నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా
- భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం
భీమదేవరపల్లి/హనుమకొండ, వెలుగు : కొత్తకొండ వీరభద్రస్వామి జాతర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. జాతరకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, బందోబస్తు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి జాతర నిర్వహణపై వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో గురువారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో పూజల అనంతరం జాతర వాల్ పోస్టర్ మంత్రి రిలీజ్ చేశారు. తరువాత అడిషనల్ కలెక్టర్ మహేందర్, డీసీపీ ఎంఏ బారీ ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే రహదారిలో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సూచిక బోర్డులు అవసరమో రిపోర్టుఇవ్వాలని ఆర్అండ్ బీ అధికారులను మంత్రి అడిగారు. అయితే ఆఫీసర్లు సమాధానం ఇవ్వకపోవడంతో మంత్రి వారిపై సీరియస్ అయ్యారు.
జాతరను సక్సెస్ చేయాలి
గత పాలకుల హయాంలో జాతరకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, ఈసారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జాతరకు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ హాజరు రావాలని కోరారు. ఆలయ ఆదాయం పెంచేందుకు వీఐపీ పాసులపై టికెట్ పెట్టే ప్రతిపాదన పెట్టగా.. ఈ అంశంపై రాజకీయాలకు తీతంగా సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రి కోరారు.
ఇదివరకు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్రెడ్డి కొత్తకొండ ఆలయానికి వచ్చారని, అప్పటి ఫొటోలు, వీడియోలతో పాటు జాతర ఔన్నత్యాన్ని తెలిపే హోర్డింగులు ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ అధికారుల సహకారంతో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తకొండ మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్, ఎండోమెంట్ ఏసీ రామల సునీత, సెంట్రల్ జోన్ డీసీపీ బారి, ఆలయ ఈఓ కిషన్, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.
అద్దె బస్సుల సమస్య పరిష్కరిస్తం
అద్దె బస్సు యజమానుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అద్దె బస్సులు నడవవని వాటి యజమానుల సంఘం ఎక్కడా ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అద్దె బస్సుల విషయంపై ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.
ఆటో కార్మికులకు నష్టం కలగనివ్వం
మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించేందుకే ఫ్రీ బస్సు స్కీమ్ పై నిర్ణయం తీసుకున్నామని, అంతేతప్ప ఆటో కార్మికులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆటో కార్మికులంతా తెలంగాణ బిడ్డలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వ్యతిరేకం కాదన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ఆటో కార్మికులకు నష్టం జరిగితే ప్రభుత్వ ప్రతినిధిగా వారి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కొత్తకొండ దేవాలయం సాక్షిగా హామీ ఇస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్థానిక నేతలు ఉన్నారు.
మేం చీటర్స్ ఎట్లయితం?
అధికారంలోకి వచ్చి నెల కూడా కాలే: మంత్రి పొన్నం
తమ పార్టీ హామీ ఇచ్చిన మేరకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగతా గ్యారంటీల అమలుకు దరఖాస్తులు తీసుకుంటుంటే బీఆర్ఎస్ లీడర్లు ఓర్వలేక తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి రోజులు కూడా కాలేదని, అప్పుడే తాము చీటర్స్ ఎట్లా అవుతామని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ లీడర్లుఅసహనానికి గురవుతున్నారని, అందుకే కాంగ్రెస్ ను చీటర్ అంటూ 420 హామీల పేరుతో బుక్ లెట్ రిలీజ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మంత్రి పొన్నం గురువారం ఆలయానికి వచ్చారు. ముందుగా ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా దోచుకున్నారని, తెలంగాణ ఖజానాను మొత్తం ఖాళీ చేశారని ఫైర్ అయ్యారు. దోపిడీ చేసినవాళ్లందరిపై డెకాయిటీ సెక్షన్ 390 ప్రకారం కేసులు పెట్టే రోజు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని తమ ప్రభుత్వం బయటపెట్టిన వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయని, వాటిని అడిగే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు, కేసులు, నిర్బంధాలు, నియంతృత్వంతో అణచివేశారని గుర్తుచేశారు.