న్యూఢిల్లీ: బంగారం, బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసినట్టే వెండి, వెండి వస్తువులకూ చేయాలని కన్జూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
(బీఐఎస్)కు సూచించారు.
ఇందుకు గల అవకాశాలను బీఐఎస్ పరిశీలించాలని, నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ సంస్థ 78 వ ఫౌండేషన్ డే ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే చర్యలు మొదలు పెట్టామని, సిల్వర్‌కు హాల్‌మార్కింగ్స్ తప్పనిసరి చేయడానికి వీలుంటుందని బీఐఎస్ తేల్చాక, నిర్ణయం తీసుకుంటామని జోషి వివరించారు.
ప్రస్తుతం సిల్వర్, సిల్వర్ వస్తువులపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. వాలంటరీ మాత్రమే. ఇండస్ట్రీలోని నిపుణులు, కంపెనీలతో చర్చిస్తున్నామని, ఇంకో 3–6 నెలల్లో సిల్వర్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారి పేర్కొన్నారు.
గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయడాన్ని 2021 జూన్ నుంచి మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇండియాలోని 361 జిల్లాల్లో ఇది అమలవుతోంది. గోల్డ్ ప్యూరిటీ తెలియజేసేలా ఆరు డిజిట్లతో కూడిన ఆల్ఫాన్యూమెరిక్ కోడ్ (హెచ్‌యూఐడీ) ని గోల్డ్, గోల్డ్ వస్తువులకు ఇస్తారు. ఇండియాలో అమ్ముడవుతున్న 90 శాతం గోల్డ్ జ్యుయెలరీకి హాల్‌మార్కింగ్ గుర్తు ఉందని, 44.28 కోట్ల గోల్డ్ జ్యుయెలరీ ఐటెమ్స్‌కు యూనిక్ ఐడీ ఇచ్చామని జోషి అన్నారు..