బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగంపై హైకోర్ట్ లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం గవర్నర్ తో సయోధ్యకు వచ్చింది. ఈ మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిసారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు.
గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళతామని.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలియజేసింది.
ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 6న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశముంది. ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటే అవకాశమున్నట్లు తెలుస్తోంది.