ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం జరిగిన టీడీపీ ‘శంఖారావం’ బహిరంగ సభకు సగం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినవారే అని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ గ్రౌండ్ చాలా చిన్నదని అన్నారు. టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చేసిన ప్రసంగంపైనా మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. ఖమ్మం అభివృద్ధి తన వల్లే అయ్యిందని చంద్రబాబు చేసిన కామెంట్స్ అయోమయం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. ‘చంద్రబాబు హాయాంలో ఖమ్మంకు వచ్చిన ఒక్క ప్రాజెక్ట్ అయినా చెబితే.. నేను ముక్కు నేలకు రాస్తాను’ అని అన్నారు. ఇప్పుడు తామంతా చాలా సుఖంగా ఉన్నామని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాష్ట్రానికి దండయాత్రలాగా వచ్చాడన్నారు. భద్రాచలంకు పూర్తి కరకట్ట చంద్రబాబు కట్టి ఉంటే మొన్న వానకు నీళ్ళు వచ్చేవా అని ప్రశ్నించారు.
టీడీపీ నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభ.. ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రావడంతో కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. సభాప్రాంగణం, పరిసర ప్రాంతాలు పార్టీ కార్యకర్తలతో కిక్కిరిశాయి. వరంగల్ క్రాస్ రోడ్ నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబుకు వెల్ కమ్ చెప్పారు. ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపేస్తామంటూ చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.