ఖమ్మంలో దొంగలు దూరారు : పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్,వెలుగు: తాను బీ ఫాం తీసుకోవడానికి హైద్రాబాద్ వెళ్తే,   కొందరు గజదొంగల వలే ఖమ్మంలో దూరారని బీఆర్​ఎస్ క్యాండిడేట్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం పారా ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో  ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్  మాట్లాడుతూ  కొందరిని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే  గెలిచినట్టు కాదన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎత్తులు వేసినా చివరకు ఓడేది కాంగ్రెస్ అని, గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయేనని దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఒకప్పుడు గొంగళి పురుగులా ఉండేదని, ఇప్పుడు సీతాకోక చిలుకలా మారిందన్నారు. అరవై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రజలకు ఏం చేసిందని   ప్రశ్నించారు. 2014లో తనపై పోటీ చేసిన లీడర్​ను ఓడించానని, రానున్న రోజుల్లో మరోసారి అదే జరగబోతుందని స్పష్టం చేశారు. మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ  తాము మంత్రి పువ్వాడ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తే,  చెప్పుతో  కొడతామని  హెచ్చరిం చారు. టీ తాగడానికి తమ ఇంటికి రావొద్దని హితవు పలికారు. అనంతరం  54వ డివిజన్ వీడీఓఎస్ కాలనీలో ఆడిటర్ శివరామ కృష్ణ ప్రసాద్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఇక్కడికి వచ్చే వారికి ఖమ్మం ఒక ఆప్షన్ మాత్రమేనని, వేరే చోట అవకాశాలు రాకపోతే ఖమ్మం వైపు చూస్తారన్నారు. కానీ తాను ఎప్పుడూ అలా చేయలేదని పేర్కొన్నారు.  రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.  13వ డివిజన్ లో పువ్వాడ సతీమణి  వసంత లక్ష్మి  ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  కార్యక్రమంలో మేయర్  నీరజ, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, పారా నాగేశ్వర రావు, పారా శ్రీనివాస్, సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

మీ సీఎం ఎవరు?

మధిర, వెలుగు: మా సీఎం కేసీఆర్​ అని, మరి మీ సీఎం ఎవరో  చెప్పాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​సవాల్​ విసిరారు. పట్టణంలో  సోమవారం బీఆర్ఎస్ నియోజకవర్గస్ధాయి  బూత్​ కమిటీ సమావేశం నిర్వహించారు.  సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కేసీఆర్​పథకాలనే కాంగ్రెస్​, బీజేపీ కాపీ కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్ ​ మేనిఫెస్టోతో కాంగ్రెస్​కు మైండ్​ బ్లాంక్ అయిందన్నారు.  

మధిర నుంచి లింగాల కమల్​రాజును గెలిపించి కేసీఆర్​కు కానుకగా ఇవ్వాలన్నారు. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. అంతకుముందు మోటార్​సైకిల్​ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వర రావు,  బీఆర్​ఎస్​ అభ్యర్థి లింగాల కమల్​రాజు, డీసీసీబీ చైర్మన్​ నాగభూషణం, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్​ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, బూత్​ కమిటీ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.