బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తా
రేవంత్ మతిభ్రమించి మాట్లాడుతున్నడు : మంత్రి అజయ్
ఖమ్మం, వెలుగు : ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టాలనుకునే బీజేపీకి బీఆర్ఎస్వ్యతిరేకమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువని, ఆ పార్టీతో బీఆర్ఎస్ కలిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని వీడీవోస్ కాలనీ క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి ఉన్న భారత సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ సెక్యులర్ భావాలను గౌరవిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వదిలిన రుగ్మతలే ఈ దేశానికి ఇబ్బందిగా మారాయని, ఇంకా పట్టిపీడిస్తున్నాయన్నారు. ఎన్డీఏ చట్టాలను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మతతత్వ పార్టీలకు చోటు లేదన్నారు. రేవంత్ అమెరికాలో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, గాంధీ భవన్ లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ‘ప్రభుత్వానికి విద్యుత్ ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు ముడుపులు ఇస్తాయా? కనీసం ఈ సంగతి కూడా తెలియకుండా పీసీసీ అధ్యక్షుడివి ఎలా అయ్యావు’ అని మంత్రి పువ్వాడ విమర్శించారు.