తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఒకే రోజు మూడు వేల ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు. 40 కంపెనీలు విజయ కాలేజీ జాబ్ మేళాకు హాజరు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమేనని, కానీ ఇప్పుడు లక్షల్లో జీతాలు ఇస్తూ ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయని మంత్రి అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రతి రోజు ఏదో ఒక కంపెనీని ప్రారంభించడం, శంకుస్థాపన చేయడమో చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయంటే ఆ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకే దక్కుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.