ముక్కోటి వైకుంఠ ఏకాదశి వైభవంగా నిర్వహించాలె
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రతతో పాటు వసతి, వైద్యం, ఇతరత్రా ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎస్పీ డాక్టర్ వినీత్, అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం శ్రీరామచంద్రస్వామి టెంపుల్ ఈవో శివాజీ పాల్గొన్నారు.
దుప్పట్ల పంపిణీ
సత్తుపల్లి, వెలుగు: స్థానిక ఎన్టీఆర్ నగర్ లోని నిరుపేదలకు నవచైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. శ్రీ వాణి బాలికల కాలేజ్ కరస్పాండెంట్ పాల ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహ రెడ్డి, తోట కిరణ్ కౌన్సిలర్ చాంద్ పాషా, నాయకులు మదీన, జెన్నీ, సంస్థ డైరెక్టర్ గాదె నాగు పాల్గొన్నారు.
భద్రాచలాన్ని విభజించొద్దు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం టెంపుల్ టౌన్‌ను మూడు పంచాయతీలుగా విభజించొద్దని, తక్షణమే జీవో నెం.45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల భద్రాచలం ప్రాంతం అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సరెళ్ల నరేశ్, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాసరావు, మాజీ గ్రంథాలయం చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
అత్యధికంగా 54,902టన్నుల బొగ్గు ట్రాన్స్పోర్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ఏరియాలో గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం 54,902టన్నుల బొగ్గును ట్రాన్స్ పోర్టు చేసి రికార్డు సృష్టించామని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాకు యాజమాన్యం నిర్దేశించిన 120లక్షల టన్నుల బొగ్గును సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 82.81లక్షల టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేశామన్నారు. మార్చి నాటికి మిగిలిన 57.81లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. బొగ్గు రవాణాలో రికార్డు సృష్టించడంలో కృషి చేసిన కార్మికులను ఆయన అభినందించారు.
ఘన స్వాగతం
కూసుమంచి : నాటి ఆలోచనే నేటి ఆధునిక టెక్నాలజీకి కారణం అని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో జరిగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ పున:నిర్మాణ సభకు హాజరవుతున్న ఆయనకు జిల్లా సరిహద్దు గ్రామం నాయకన్‌గూడెంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి నుంచి ర్యాలీగా కేశ్వాపురం వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో చాలా రోజుల తరువాత అడుగు పెడుతున్నానన్నారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేయాలన్నారు. హైద్రాబాద్ పురోగతిలో టీడీపీ కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ర్ట కార్యదర్శి జర్పుల శ్రీను, మందపల్లి కోటీ, మందపల్లి రజిని, నల్లమల్ల రంజిత్‌కుమార్, గోపీ పాల్గొన్నారు.
చంద్రబాబు సభకు తరలిన కార్యకర్తలు
కల్లూరు/అశ్వరావుపేట : టీడీపీ బహిరంగ సభకు కల్లూరు, అశ్వరావుపేట మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సుమారు నాలుగు వేలమంది తరలి వెళ్లారు. కల్లూరు మండలం నుంచి నాయకులు కాకర్ల రంగారావు, మాజీ ఎంపీటీసీ పోటు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కన్నికంటి కృష్ణార్జునరావ్, వలసాల వెంకటరామయ్య, దేవల్ల ఏడుకొండలు, కొమ్మినేని నాగేశ్వరరావు, బానోత్ చిట్టిబాబు, గోసు కృష్ణారావు ఉన్నారు.
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ర్యాలీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విద్యావ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ అన్నారు. కొత్తగూడెంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట చేసిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలన్నారు. కాలేజీలు, స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రోగ్రాంలో పీడీఎస్‌యూ నాయకులు పృథ్వీ, నరేందర్, రంగవల్లి, గంగాధర, గణేష్ పాల్గొన్నారు.
ఓసీ 2 మైన్ రికార్డులను తిరగరాయాలి : డైరెక్టర్ ఆపరేషన్స్
మణుగూరు, వెలుగు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని పీకే ఓసి 2 మైన్ ప్రొడక్షన్లో తన రికార్డులను తిరగరాయాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ సూచించారు. మణుగూరు ఏరియాలో బుధవారం పర్యటించిన ఆయన ఏరియా జీఎం జి.వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి పీకే ఓసి 2 ఓపెన్ కాస్ట్ మైన్ ను సందర్శించారు. మైన్ లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, బంకర్ ద్వారా బొగ్గు సరఫరాను పరిశీలించారు. అనంతరం పీకే ఓసి 2 మైన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థలోనే మణుగూరు పీకే ఓసీ 2కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని ఇప్పటివరకు సింగరేణి వ్యాప్తంగా అనేక రికార్డులను సాధించిన మైన్ భవిష్యత్తులో కూడా తన రికార్డులను తిరగరాసే విధంగా ఉత్పత్తి సాధించాలని కోరారు. మిషనరీని పూర్తిస్థాయిలో వాడుకొని టార్గెట్ ను సాధించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ టి.లక్ష్మీపతి గౌడ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరభద్రుడు, మేనేజర్ రాంబాబు, సర్వే ఆఫీసర్ సిహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
దళిత బంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి
చింతకాని(మధిర)వెలుగు: దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. చింతకాని మండలం అనంతసాగర్ లలో ఆమె పర్యటించి, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. బోనకల్ క్రాస్ రోడ్ వద్ద కిరాణా షాప్, చింతకాని అనంతసాగర్ గ్రామంలో డెయిరీ, కిరాణా షాపు యూనిట్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను లాభదాయకంగా నిర్వహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు. దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు. యూనిట్ల పరిశీలన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలానికి రూ. వంద కోట్ల హామీ ఏమైంది?
బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి రాకేశ్‌రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలానికి రూ. వంద కోట్లు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ ప్రశ్నించారు. లక్ష్మీదేవిపల్లిలోని పార్టీ జిల్లా ఆఫీస్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి అడ్డంగా దొరికిన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత పేరును సీబీఐ పేర్కొందన్నారు. పోడు పట్టాలిస్తానంటూ కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారన్నారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ నాయకులు వై. శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా
పాల్వంచ, వెలుగు: ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రంగా ప్రసాద్ కు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా లీడర్లు విశ్వనాథం, సాయిబాబు, పూర్ణ, రాహూల్, నాగరాజు పాల్గొన్నారు.
ఆస్పత్రి ఆద్దాలు ధ్వంసం
పాల్వంచ, వెలుగు: పాల్వంచ కు చెందిన గొర్రెల శ్రీలక్ష్మీ మృతి కి శ్రీరక్ష హాస్పటల్ వైద్యులే కారణమని ఆరోపిస్తూ బుధవారం హాస్టిటల్ లో అద్దాలు, టీవీ పలువురు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు డాక్టర్లు తెలిపారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలోని వస్తువులను పగలగొట్టినట్టు స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నరేశ్ హాస్పటల్ కు వచ్చి, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడే ఉన్న మున్సిపల్ పంప్ ఆపరేటర్ జానీ సెల్ ఫోన్ పగలగొట్టి అతని పై దాడి చేసినట్లు ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు.
దళారులతో దళితబంధు అవినీతిమయం : సీపీఐ జిల్లా సెక్రటరీ సాబీర్‌పాషా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దళారీ వ్యవస్థతో దళితబంధు అవినీతి మయంగా మారిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్‌పాషా విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల ఇండ్ల ముందు దళితులు మోకరిల్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పదేళ్లుగా ఒక్క రేషన్‌కార్డునూ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. డబుల్ ఇండ్ల జాడలేకుండా పోయిందన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టుకునేందుకు రూ. 3లక్షలు ఇస్తామని చెప్పిన సీఎం హామీ అటకెక్కిందన్నారు. గ్రామాలు, బస్తీలు సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ జిల్లా నాయకులు వై. శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాసరావు, దమ్మాలపాటి శేషయ్య, కంచర్ల జమలయ్య, మురళి, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, ధనలక్ష్మి, భాస్కర్; విజయ్ కుమార్ పాల్గొన్నారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి పువ్వాడ
గర్బిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని రామవరం మాతా, శిశు సంరక్షణ గవర్నమెంట్ హాస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో హెల్త్ మినిష్టర్ హరీశ్‌రావు కామారెడ్డి నుంచి వర్చువల్ గా కేసీఆర్ న్యూటిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గర్బిణులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కిట్ల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రక్తహీనత వల్ల డెలివరీల టైంలో గర్భిణుల మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుందన్నారు. దేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే ఈ కిట్ల పంపిణీ జరుగుతోందన్నారు. జిల్లాలో దాదాపు 11వేల మంది గర్భిణులున్నారన్నారు. వీరందరికీ దశల వారీగా కిట్లను అందజేయనున్నట్టు తెలిపారు. కిట్‌లోని పౌష్టికాహారాన్ని గర్భిణులు మాత్రమే తీసుకోవాలని, ఇంట్లో వాళ్లకు ఇవ్వొద్దని సూచించారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కె. సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ శిరీష, హాస్పిటల్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ రవిబాబు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మణ్, సూపరింటెండెంట్ కుమారస్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రాజేందర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పంపిణీలో ప్రొటోకాల్ రగడ..
చండ్రుగొండ: చండ్రుగొండ పీహెచ్ సీ లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ జరిగింది, మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాశ్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ నిర్వహించగా.. ముఖ్య అతిథులతో పాటు బీఆర్ఎస్ లీడర్ల ను పిలిచారు. కార్యక్రమం జరుగుతుండగా చండ్రుగొండ జడ్పీటీసీ వెంకటరెడ్డి వచ్చారు. ఆ సమయంలో డయాస్ పైన కూర్చోబెట్టేందుకు కుర్చీ లేక డయాస్ పక్కన వేసి కూర్చో బెట్టారు. కిట్లు పంపిణీ సమయంలో ముందుగా జడ్పీటీసీ చేతుల మీదుగా ఇవ్వాలని ప్రకటించగా అందుకు ఆయన నిరాకరించారు. ప్రొటోకాల్ తెలియదా అని, కనీసం సభా గౌరవం పాటించకపోతే ఎట్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మండలంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆఫీసర్లకు, బీఆర్ఎస్ వర్గపోరు తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారు.
కులమతాలకు అతీతంగా అభివృద్ధి
కామేపల్లి, వెలుగు: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని ముచ్చర్ల వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రిస్టియన్లకు ప్రభుత్వ కానుకలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత రామదాసు, ఎంపీటీ సభ్యులు కీసర మంజుల విష్ణువర్ధన్ రెడ్డి, లాకావత్ సునీత లక్ష్మీనారాయణ, సర్పంచులు లూసి, మూడు దుర్గా జ్యోతి కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో పసుమర్తి వెంకట సత్యనారాయణ గుప్తా, మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు అబ్రహం, సుధాకర్ ,రమేశ్ పాల్గొన్నారు.