మైనార్టీలకు ఆర్థిక చేయూత అందిస్తున్నం : పువ్వాడ అజయ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: మైనార్టీలకు ఆర్థిక చేయూత అందించేందుకు బీఆర్ఎస్​ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ కుమార్ తెలిపారు. గురువారం ఖమ్మంలో మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మంత్రి అజయ్ అందజేశారు. మైనార్టీ యువతకు మంజూరైన రెండు కార్లను పంపిణీ చేశారు. ఖమ్మం సిటీలోని మైనార్టీ మహిళకు మంజూరైన 400 కుట్టు మిషన్లు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మైనార్టీల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళలకు చేయూత అందించేందుకు మొదట మంజూరైన 200 కుట్టుమిషన్లతోపాటు సీఎంతో మాట్లాడి మరో 200 మంజూరు చేయించినట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, ఏఎంసీ చైర్మన్ శ్వేత, జడ్పీటీసీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. 

అలాగే ఖమ్మంలోని పలు డివిజన్లలో రూ.2.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నారు.