
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి (78) కన్నుమూశారు. సోరియాసిస్‌తో బాధపడ్తున్న ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని నిమ్స్‌లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం ఖోడద్లో 1944, ఏప్రిల్ 4న జన్మించారు. ఆయన కు భార్య లక్ష్మీదేవి ఉన్నారు. సంతానం లేరు. శుక్రవా రం ఆదిలాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
చివరి వరకు కాంగ్రెస్‌లోనే
రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీ యాల్లో సీఆర్ఆర్గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. చివరి వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారు. పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా, ఫారెస్టు కార్పొరేషన్ డెవలప్ మెంట్ సెనేట్ మెంబర్‌గా, మంత్రిగా కీలక పదవులు చేపట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. 1978,1985 లో ఇండిపెండెంట్ గా.. 1989, 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో టీడీపీ అభ్యర్థి జోగు రామన్నపై గెలిచారు. 1991 నుంచి 92 వరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో చిన్ననీటి పారుదశాల శాఖ మంత్రిగా, నేదురుమల్లి జానార్దన్‌రెడ్డి హయాంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో జోగు రామన్న చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న సీఆర్ఆర్.. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తనకు పిల్లలు లేకపోవడంతో తన రాజకీయ వారసుడిగా అక్క కుమారుడు సంజీవ్ రెడ్డిని రామచంద్రారెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌నుంచి సంజీవ్ రెడ్డిని బరిలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే జిల్లాలో సీఆర్ఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమవుతున్న తరుణంలో ఆయన మరణం పార్టీకి తీరనిలోటని నాయకులు చెబుతున్నారు.
అధికార లాంఛనాలతో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు
హైదరాబాద్: రామచంద్రారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. అలాగే, రామచంద్రా రెడ్డి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.