
మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులు అభ్యసిస్తేనే జాతి నిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. బుధవారం (ఆగస్టు 16న) రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం అనే కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడారు.
ప్రస్తుత ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేలా చిన్ననాటి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా చెలిమి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు వ్యాపార దృక్ఫథాన్ని పెంచడంతో పాటు ప్రపంచంలో వ్యాపారం చేసే వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు అంకురం అనే కార్యక్రమాన్ని కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
విద్యార్థులను నూతన శిఖరాలకు చేర్చడంపైనా, సాధికారులను చేయడంతో పాటు వీలైన అవకాశాలు లభించేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతి జిల్లాలోనూ ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి.. చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెస్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లో 11వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చేస్తున్నామని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి మరిన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ. వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన పాల్గొన్నారు.