నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలను తీసుకురావొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇతర నేతలను,అధికారులను కలవడానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని ఆమె ప్రజలను కోరారు. అలాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
స్థానికంగా ఉండే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడీ పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిళ్లు అందించాలని కోరారు. రానున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని.. అందరూ సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తే బాగుంటుందన్నారు. ఈ దిశగా ఆదర్శప్రాయ నిర్ణయాలు తీసుకొని జిల్లాలో సరికొత్త విధానానికి నాంది పలకాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.