మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు: మహేశ్వర్ రెడ్డి

మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు: మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ , వెలుగు:  నిర్మల్ మున్సిపాలిటీలో రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ కేవలం బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులకు అనుకూలంగా మారిందన్నారు. గురువారం మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ కుంభకోణం వెనుక మంత్రి, ఆయన బంధువుల హస్తం కూడా ఉందని ధ్వజమెత్తారు. గతంలో రైతులు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు దానిని రద్దు చేస్తున్నట్లు స్వయంగా మంత్రి ప్రకటించారన్నారు. 

మళ్లీ అదే మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తుండడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.  సోఫీనగర్ లోని రెండు ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని 25 కోట్లకు ఓ బడా కంపెనీకి అమ్ముకున్నారన్నారు.  కుంభకోణానికి వ్యతిరేకంగా సోమవారం ఆర్డీవో ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో  అయ్యన్న గారి భూమయ్య ,  రావుల రామనాథ్,  రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి,  ఒడిసెల అర్జున్,  డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి,  సాధ అరవింద్, అల్లం భాస్కర్,  నూతుల భూపతిరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.