ములుగు, వెలుగు : కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, బీఆర్ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ములుగులోని లీలా గార్డెన్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కలిసి ఆమె మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు.
నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంపాలన దిశగా అడుగులు పడ్డాయన్నారు. పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రజల కోసం ప్రాణాలు ఒదిలిన మావోయిస్టు నేత బిడ్డ అయిన నాగజ్యోతిని ప్రజలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు, నాయకులు అజ్మీర ధరంసింగ్, గండ్రకోట సుధీర్, భూక్య దేవ్‌సింగ్, పూమానాయక్, పాడ్య కుమార్, కోగిల మహేశ్ తోపాటు బంజారా మహిళలు పాల్గొన్నారు.
సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి
మహబూబాబాద్, వెలుగు : ఈనెల 27న మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మున్సిపాలిటీలోని శనిగపురం శివారులో సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, పీఏసీఎస్ ఛైర్మన్ నాయిని రంజిత్, బీఆర్ఎస్ నాయకులు మార్నెని వెంకన్న, పోతురాజు ఉన్నారు.