రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోతే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరి.. అభివృద్ధి, ఆత్మాభిమానం అని మాట్లాడడం విడ్డూరమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబం బాగుపడడానికి బీజేపీ 18వేల కోట్లు ఇచ్చిందన్నారు. మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి చేసిందేమిలేదని.. తాండాల్లో సరైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే.. సంక్షేమ ఫలాలన్నీ ప్రజలకు సక్రమంగా అందుతాయని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చి ఫ్లోరైడ్ను రూపుమాపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత పాలకులు మునుగోడును నిర్లక్ష్యం చేస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పాటుపడుతుంటే.. దానిని బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.