- మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్, వెలుగు : ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి మేడారం, రామప్ప గుర్తొచ్చాయా అని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. హనుమకొండలోని పార్టీ ఆఫీస్‌లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మేడారం వైపు కన్నెత్తి కూడా చూడని వారు ఇప్పుడు జాతీయహోదా కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని, జనాలు లేక సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన పోడు చట్టాల వల్లే గిరిజనులు, గిరిజనేతరులకు అన్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చే విషయంలో సపోర్ట్ చేయని కాంగ్రెస్ ఇప్పుడు 12 శాతం అని మాట్లాడుతూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సీతక్కకు ప్రచార ఆర్భాటం తప్పితే అభివృద్ధి తెల్వదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంలను మార్చకుండా ఉంటారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని ఈ సారి 108 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రామప్ప టెంపుల్‌కు యునెస్కో గుర్తింపు వచ్చేలా రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఏనాడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఈ సారి ఓటమి తప్పదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, కవిత పాల్గొన్నారు.