కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదు : సత్యవతి రాథోడ్

హాలియా, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉండదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆత్మగౌరవ సభ లో సాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 25 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల మంది గిరిజన రైతులకు పోడుభూమి పట్టాలు అందజేస్తే పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ 4 లక్షల పైచిలుకు మంది గిరిజనులకు పోడు భూమి పట్టాలని పంపిణీ చేశామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లోఈ ప్రాంత గిరిజనులు కారు గుర్తుకు ఓటు వేసి నోముల భగత్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జానారెడ్డిని ఈ ప్రాంత ప్రజలు ఏడుసార్లు గెలిపిస్తే ఆయన మాత్రం ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. నెల్లికలు లిఫ్ట్ పూర్తి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.  అంతకు ముందు హాలియాలో దేవరకొండ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు తీసిన గిరిజన ర్యాలీ జనసంద్రం గా మారింది.

ALSO READ : తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్​రెడ్డి

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ కోపరేటివ్ చైర్మన్ వాల్య నాయక్, రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, ఎస్టీ కార్పొరేషన్ మెంబర్ రాంబాబు నాయక్ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జెడ్పిటిసి అబ్బీడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు బాబురావు నాయక్, వివేకారావ్, సాదం సంపత్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షుడు కేతావత్ బిక్షా నాయక్ పాల్గొన్నారు.