ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మరక్షణ పోరాటం

మహబూబాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఈటల టీఆర్ఎస్‌‌ను వీడాలనుకుంటే బర్తరఫ్ చేసిన రోజే వీడాల్సిందన్నారు. ఆయన ఆత్మగౌరవం కోసం కాకుండా ఆత్మరక్షణకు పోరాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఈటల చేసిన సేవ కంటే ఆయనకు సీఎం కేసిఆర్ ఎక్కువగానే పదవులు, బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీలో ఆయన చేరుతున్నారని మండిపడ్డారు. 

‘టీఆర్ఎస్‌‌తోపాటు ప్రజలకు వ్యతిరేకంగా పలు కార్యకలాపాలకు ఈటల పాల్పడుతున్నారనే ఆయనను పార్టీ నుంచి ఆయననను తొలగించాం. సీఎం కేసీఆర్‌‌పై ఈటల విమర్శలను ఖండిస్తున్నాం. ఐదేళ్లుగా అవమానం జరుగుతుంటే ఆత్మగౌరవం కోసం పాటుపడక ఈరోజు వరకు ఎందుకు ఊరుకున్నారు? ఈటల ఈ స్థాయికి రావడానికి గొప్ప అవకాశం కల్పించింది సీఎం కేసీఆరే. ఈటల తనకున్న అధికారం, గౌరవం ద్వారా ఆ ప్రాంతానికి మేలు చేయాల్సింది. కానీ పేదోళ్ల భూములు తీసుకున్నారు. కేసీఆర్ తనకు తెలంగాణ ప్రజలే హై కమాండ్. కాబట్టి సామాన్యుని ఫిర్యాదులపై స్పందించి మంత్రి అని కూడా చూడకుండా బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ చేసిన రోజే ఈటల రాజీనామా చేసుంటే బాగుండేది. అన్ని పార్టీల దగ్గరకు, అందరి వద్దకు వెళ్లి  ఆత్మ రక్షణలో పడి గౌరవం తాకట్టు పెట్టుకుని బీజేపీ దగ్గరకు వెళ్లి రాజీనామా చేస్తున్నారు’ అని సత్యవతి పేర్కొన్నారు.