ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌పై రేవంత్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు సరికాదు : మంత్రి సత్యవతి

మహబూబాబాద్, వెలుగు : రైతులకు కేవలం మూడు గంటల కరెంటే సరిపోతుందని చెప్పడం సరికాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం, మాయమాటలు చెప్పడం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపు చూసి ఇక్కడి లీడర్లు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

పరకాల/ఎల్కతుర్తి, వెలుగు : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌‌‌‌‌‌‌‌ చాలు అని చెప్పిన టీపీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి, పరకాల, నాగారం రైతు వేదికల్లో గురువారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హయాంలో కరెంట్‌‌‌‌‌‌‌‌ సరిగా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

అలాగే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ రైతు వేదికలో ఎమ్మెల్యే వొడితల సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని విమర్శించారు. అనంతరం ‘మూడు గంటలు వద్దు.. మూడు పంటలు కావాలి’ అంటూ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.