హైదరాబాద్ : తన సొంత ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. మూడేళ్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు, కార్యక్రమాలు చేయని రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలిచిపోనుందన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 3 ఉప ఎన్నికలు వస్తే.. అందులో రెండు చోట్ల భారీ మెజారిటీతో తామే గెలిచామన్నారు.
మునుగోడులో కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడా తమకే ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఆడపిల్లలకు మేనమామలా కేసీఆర్ అండగా ఉండి కల్యాణలక్ష్మీ వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. మునుగోడులో ఆడబిడ్డలు టీఆర్ఎస్ కు అండగా ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికే భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ రాజకీయ అనుభవం అంత లేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలు దూసుకెళ్తున్నారు
శిశు విహార్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీకారం చుట్టారు. డైనింగ్ హాల్ తోపాటు, ఐసీడీసీ ఖైరతాబాద్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ దివ్య దేవరాజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడపిల్లలు సగర్వంగా తలెత్తుకునేలా చేశారని, వారికి అన్ని విధాలుగా అండగా ఉన్నారని చెప్పారు. ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ‘షీ టీమ్స్ వంటి కార్యక్రమాలు బాలికలు, మహిళలకు భదత్రగా ఉన్నాయన్నారు. వచ్చిన అవకాశాలను ఆడపిల్లలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు.