మోటార్లకు మీటర్లు పెట్టకపోవడంతో సీఎం కేసీఆర్ పై బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఒక్కో మీటర్‌కు రూ.80వేల నుంచి లక్ష రూపాయల బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ఆలోచించి.. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడుతున్నారని అన్నారు. ఇనుగుర్తి మండలానికి వేరే పార్టీ నాయకులు వచ్చి కేసీఆర్‌పై చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఉరికించి కొట్టాలని చెప్పారు. ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తి మండల కేంద్రాన్ని టీఆర్ఎస్ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
బీజేపీ కావాలనే దాడులు చేయిస్తోంది: సత్యవతి రాథోడ్
తెలంగాణలో అలజడులు సృష్టించడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. షర్మిల శిఖండి రాజకీయాలు మానుకోవాలన్నారు. మానుకోట రాళ్లను మరిచిపోవద్దని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆమె చెప్పారు. ఏపీలో సీఎం జగన్ మోటార్లకు మీటర్లు పెట్టారని.. తెలంగాణలో మాత్రం అలా జరగదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో బీజేపీ దాడులు చేస్తోందని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
చిల్లరగా మాట్లాడితే ఊరుకునేది లేదు: మాలోత్ కవిత
తెలంగాణలో ఎవరైనా సహజంగా పాదయాత్ర చేసుకోవచ్చని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కానీ.. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను తిడితే ఊరుకునేది లేదంటూ వైఎస్ షర్మిల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ రాజ్యం మాకు అవసరం లేదు.. ఆంధ్రకు వెళ్లిపో అంటూ షర్మిల పై వ్యాఖ్యలు చేశారు. చిల్లరగా మాట్లాడితే.. 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ షర్మిలకు ఎంపీ మాలోత్ కవిత వార్నింగ్ ఇచ్చారు.