
కంటి వెలుగును సక్సెస్ చేయాలి
ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
రాష్ట్ర గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు, భూపాలపల్లి అర్బన్, వెలుగు : ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. గురువారం ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా ‘కంటి వెలుగు’పై మంత్రి రివ్యూ నిర్వహించారు. కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, భవేశ్‌మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి ‘కంటి వెలుగు’ రెండో విడత ప్రారంభమవుతుందన్నారు. దీనిపై గ్రామాల్లో డప్పు చాటింపు చేయించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అవగాహన కల్పించాలన్నారు. ములుగు జిల్లాలో 20 టీంలు, భూపాలపల్లిలో 25 టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టీంలో 8మంది మెంబర్లు ఉంటారన్నారు. కంటి చూపు సమస్య ఉన్నవారికి 10రోజుల్లో కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఆ తర్వాత ‘కంటి వెలుగు’ డెమో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జీవో 58 ప్రకారం ములుగు జిల్లా మంగపేట మండలంలో నలుగురు లబ్ధిదారులకు ఇంటి స్థలం హక్కు పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, రైతుబంధు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, లైబ్రరీ చైర్మన్ పొరిక గోవింద్ నాయక్, డీఆర్వో రమాదేవి తదితరులున్నారు.
‘మినీ మేడారం’ జాతరకు ఏర్పాట్లు చేయండి..
వచ్చే నెల 1 నుంచి 4వరకు సాగే ‘మినీ మేడారం’ జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ములుగులో ‘కంటి వెలుగు’ అనంతరం జాతరపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు తాగునీరు, వసతి, టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. గద్దెల సమీపంలో పరిశుభ్రత పాటించాలని, జంపన్నవాగులో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు ఇంకా 25 రోజులు మాత్రమే టైం ఉన్నందున ఆఫీసర్లు పనుల్ని వేగంగా పూర్తి చేయాలన్నారు.
రోడ్లు బాగు చేయండి..
మేడారంతోపాటు ఐలాపూర్, కొండాయి జాతర్లు కూడా అదే టైంలో జరుగుతాయని పలువురు పూజారులు మంత్రికి తెలిపారు. కానీ ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు సరిగ్గా లేవన్నారు. దీంతో స్పందించిన మంత్రి ఎండోమెంట్ ఈవోకు రూ.3కోట్ల ఫండ్స్ కోరుతూ లేఖ రాయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఆయా గ్రామాల్లోనూ భక్తులకు సౌలతులు కల్పించాలన్నారు.
కంటి వెలుగు ఫెయిలైతే.. లీడర్లు, ఆఫీసర్లు ఫెయిల్ అయినట్టే..
హనుమకొండ, వెలుగు : కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లీడర్లు, ఆఫీసర్లు టీం వర్క్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఒకవేళ కంటివెలుగు కార్యక్రమం ఫెయిలైతే లీడర్లు, ఆఫీసర్లు అంతా ఫెయిలైనట్టేనని చెప్పారు. గురువారం వరంగల్, హనుమకొండ జిల్లాల కంటి వెలుగు సన్నాహక సమావేశాన్ని హనుమకొండ కలెక్టరేట్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా మంత్రి హాజరై మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. మొదటి విడత బాగా సక్సెస్ అయ్యిందని, దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. లీడర్లు, ఆఫీసర్లు సమన్వయంతో క్యాంప్‌లు నిర్వహించాలన్నారు. క్యాంప్ జరిగే రోజు గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సఫాయి కార్మికులు అంతా అక్కడే ఉండాలని, వసతులకు లోటు లేకుండా చూసుకోవాలన్నారు. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి రూ.వెయ్యి ఇస్తున్నారని, క్యాంపుల్లో పని చేసే సిబ్బందికి రూ.1500 ఇస్తున్నారన్నారు. ఇప్పటికే రీడింగ్ గ్లాసెస్ జిల్లాలకు వచ్చాయని, టెస్టులు చేసిన తరువాత 10,15 రోజుల్లో అద్దాలు వస్తాయన్నారు. సరిపడా మందులు కూడా ఇస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసం ఎన్నో కార్యక్రమాలు జరిగాయని, కానీ ఇంతమంచి ప్రోగ్రాం ఎవరూ నిర్వహించలేదన్నారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, ఒడితెల సతీశ్ బాబు, అరూరి రమేశ్, వరంగల్ అర్బన్, రూరల్ జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ , రైతు రుణ విమో చన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ, వరంగల్ కలెక్టర్ గోపి, మేయర్ సుధారాణి తదితరులు ఉన్నారు.