పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : బీఆర్‌ఎస్ హయాంలోనే తండాలు అభివృద్ధి అయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్, హర్జాతండాలో కొత్తగా కట్టిన జీపీ భవనాలను, సీసీ, బీటీ రోడ్లు, నందానాయక్ తండాలో బంజారా భవన్, రంగాపురం వరకు బీటీ రోడ్డు పనులను బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటున్నామని చెప్పారు. అనంతరం అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1,192 మంది రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సంగెం ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానందం పాల్గొన్నారు.