ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త  వార్తలు

అలంపూర్, వెలుగు:  అంగన్‌‌‌‌ వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని గిరిజన అభివృద్ధి,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.  సోమవారం అలంపూర్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌లో అంగన్‌‌‌‌వాడీ,  సఖి సెంటర్లు,  చైల్డ్ లైన్, బాల్య వివాహాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను గురించి అడిగి తెలుసుకున్న ఆమె త్వరలోనే భర్తీ చేస్తామని మాటిచ్చారు.  గర్భిణులు, బాలింతలు, పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలన్నదే సర్కారు లక్ష్యమని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.  పాలు, గుడ్లు, భోజనం, బాలమృతంతో పాటు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని, అవి లబ్ధిదారులకు చేరేలా చూడాలని సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ అపూర్వ చౌహన్ మంత్రికి వివరించారు. బడీడు పిల్లల గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడగగా.. ప్రతి మంగళవారం మీటింగ్ పెట్టి పేరెంట్స్‌‌‌‌కు అవగాహన కల్పిస్తున్నట్లు జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదా బేగం వివరించారు.  బాల్యవివాహాలపై మాట్లాడుతూ గ్రామాల్లో నెట్‌‌‌‌వర్క్ ఏర్పాటు చేసుకొని చైల్డ్‌‌‌‌ మ్యారేజెస్‌‌‌‌ జరగకుండా చూడాలన్నారు.  1098, 181 అత్యవసర నెంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని,  చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణానికి ఈ నెలలోనే  చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.  మంత్రి  అంతకుముందు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు.  ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, చైర్మన్ సహదేవ్, డీడబ్ల్యూవో హేమలత, ఎస్టీ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు తదితరులు  పాల్గొన్నారు.  

వైకుంఠ వైభవం

ఉమ్మడి జిల్లాలోని మన్నెంకొండ, కురుమూర్తి, పాలెం, వట్టెం తదితర  వైష్ణవ ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి.  సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.  పూజలు, అభిషేకాలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.  పలుచోట్ల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, భజనలు అలరించాయి. 
‌‌ - నెట్‌‌వర్క్‌‌, వెలుగు


మాజీ జడ్పీటీసీకి రిమాండ్

వనపర్తి, వెలుగు: వనపర్తి మాజీ జడ్పీటీసీ, టీడీపీ నేత గొల్ల వెంకటయ్యకు ఓ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే..  వనపర్తి మెడికల్ కాలేజీ భూ సేకరణలో భాగంగా.. 64 మంది  రైతులు 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 200 సర్వే నెంబర్‌‌‌‌లోని భూమి కూడా పోతోంది.  ఇందులో మాజీ జడ్పీటీసీ గొల్ల వెంకటయ్య భూమి కూడా ఉంది.  నాలుగేళ్ల కింద మిగతా రైతులు జగత్ పల్లి యాదగిరి, ముష్టి గోపాల్, ముష్టి ఆంజనేయులు, ముష్టి నాగన్న, ముష్టి అడివన్న, కె.ఆంజనేయులు, కె. రాములు, కె.వెంకటేశ్‌‌, చీర్ల రాములు, చీర్ల శ్రీనివాసులు, ఆంగోత్ లక్ష్మణ్ దగ్గర హైకోర్టులో కేసు వేస్తానని సంతకాలు తీసుకున్నాడు.  తర్వాత మంత్రి నిరంజన్‌‌ రెడ్డి మరోరకంగా సాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ రైతులు భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.  అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇన్నాళ్లు సైలెంట్‌‌గా ఉన్న వెంకటయ్య కలెక్టర్ ప్రొసీడింగ్స్‌‌ రద్దు చేయాలని డిసెంబర్‌‌‌‌ 14న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  దీంతో రైతులు తమ అనుమతి లేకుండా హైకోర్టులో కేసు వేసి తమకు పరిహారం రాకుండా చేస్తున్నారని  వెంకటయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఇందులో ముష్టి ఆంజనేయులు, ముష్టి నాగన్నలు ఇటీవల చనిపోయారని, వెంకటయ్య కోర్టును తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు వెంకటయ్యను సోమవారం అదుపులోకి తీసుకొని వనపర్తి కోర్టులో హాజరు పరచగా..  విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారని వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు..

జీపీ నిధుల మళ్లింపు సరికాదు

ఉప్పునుంతల, జడ్చర్ల టౌన్, అచ్చంపేట వెలుగు: ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను ఇతర పథకాలకు మళ్లించడం సరికాదని కాంగ్రెస్‌‌ నేతలు మండిపడ్డారు. సోమవారం టీపీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపి.. సీఎం కేసీఆర్‌‌‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీ నిధుల మళ్లింపుపై ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నాకు సిద్ధమైన టీపీసీసీ చీఫ్  రేవంత్​రెడ్డి, ముఖ్యనేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. దీన్ని బట్టే కాంగ్రెస్‌‌ అంటే ప్రభుత్వానికి ఎంత భయమో అర్థం చేసుకోవచ్చన్నారు.
సీఎం కేసీఆర్ వెంటనే సర్పంచులకు నిధులు ఇవ్వడంతో పాటు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్  చేశారు. 

మతమార్పిడి ప్రచారంలో నిజం లేదు: కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు 

కల్వకుర్తి, వెలుగు:  కల్వకుర్తిలో మతమార్పిడి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు స్పష్టం చేశారు. ఆయన వివరాల ప్రకారం..  పట్టణానికి చెందిన భాస్కరాచారి కొడుకు శివరామరాజు కొన్నాళ్లుగా ముస్లిం అయిన విక్కీ దగ్గర పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మతం మారతానని చెప్పి విజయవాడ జమాత్‌‌కు వెళ్లాడు.  విషయం తెలుసుకున్న తండ్రి  పోలీసులకు ఫిర్యాదు చేయగా శివరామరాజును  తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.  తనను ఎవరూ మతమార్పిడికి ప్రోత్సహించలేదని ఇష్టపూర్వకంగా వెళ్లానని వివరణ ఇచ్చాడు. ఇక ముందు తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకుంటారని చెప్పాడు.  ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని డీఎస్పీ కోరారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిని గుర్తించాలి

కందనూలు, వెలుగు: బిజినేపల్లి గ్రామ శివారులోని సాకలి వాని చెరువు ,ఈదెల చెరువు,  మొద్దుల కుంటను సర్వే చేసి ఎఫ్‌‌టీ ఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఆల్లోజి డిమాండ్ చేశారు.  సోమవారం బిజినేపల్లి మండల పరిషత్ ఆఫీసు ముందు ధర్నా చేశారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సాకలి వాని చెరువు  శిఖాన్ని  కొందరు  కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు.  ఆ విషయాన్ని  ఇరిగేషన్‌‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.  చెరువుల నుంచి నల్ల మట్టిని అమ్ముకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. చెరువు విస్తీర్ణం తగ్గుతుండడంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం తహసీల్దార్‌‌‌‌ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ఆంజనేయులు, చంద్రయ్య,పెంటయ్య , నర్సయ్య  తదితరులు పాల్గొన్నారు. 

మతతత్వ, నియంత పార్టీలకు రోజులు దగ్గరవడ్డయ్: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి

వనపర్తి, వెలుగు: మతతత్వ బీజేపీ, నియంత బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలకు  రోజులు దగ్గర పడ్డాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తిలో యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు సాగర్ అధ్యక్షతన  నిర్వహించిన ‘యూత్ జోడో   బూత్ జూడో’ కార్యక్రమానికి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కాలంలో దేశానికి బీజేపీ, రాష్ట్రానికి బీఆర్‌‌‌‌ఎస్‌‌ చేసిందేమీ లేదన్నారు. విధ్వేషాలు, అక్రమాలు, అవినీతి తప్ప.. ఏ వర్గం కూడా బాగుపడలేదన్నారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జనం నుంచి విశేషమైన ఆదరణ లభించిందని,  ఈ స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి,   యూత్ కాంగ్రెస్ నేతలు శివ శంకర్ యాదవ్,  రాజకుమార్,  చిన్న గౌడ్,  రొయ్యల రమేశ్,  యాదగిరి,  శ్రీనివాసులు,  జయకర్, శివకుమార్, కుంకి రమేశ్‌‌ పాల్గొన్నారు. 

లీగర్ సర్వీసెస్‌‌ అథారిటీ ఆఫీసులు ఓపెన్

నాగర్ కర్నూల్‌‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లా కోర్టుల్లో ఏర్పాటు చేసిన న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను సోమవారం హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ పి. నవీన్ రావుతో కలిసి వర్చువల్‌‌గా   ఓపెన్‌‌ చేశారు.  అనంతరం ప్రత్యక్షంగా హాజరైన నాలుగు జిల్లాల ప్రిన్సిపల్ జడ్జిలు రాజేశ్ బాబు, మహ్మద్ అబ్దుల్ రఫీ, కనకదుర్గ, ముజీబ్ అహ్మద్ ఖాన్,  అడిషనల్, సెషన్స్ జడ్జిలు, కలెక్టర్లు, అడిషనల్‌‌ కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి రిబ్బన్ కట్‌‌ చేశారు. - నెట్‌‌వర్క్, వెలుగు

పత్తికి గిట్టుబాటుధర కల్పించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పత్తికి క్వింటాల్‌‌కు రూ. 15 వేల గిట్టుబాటు ధర కల్పించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ డిమాండ్ చేశారు.  సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న రూ.7వేలు గిట్టుబాటు కావడం లేదని, అందుకే రైతులు మార్కెట్లకు పత్తి తీసుకు రావడం లేదన్నారు. అప్పులు తెచ్చి పంట సాగు చేసిన కొందరు రైతులు అగ్గువకే దళారులకు అమ్ముకుంటున్నారని వాపోయారు.  గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేయడమంటే రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి.. ఇతర సబ్సిడీలు బంద్‌‌ చేయడం  దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు పృథ్వీరాజు, కోశాధికారి ఆనంద్, నేతలు కల్యాణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.

పోటీల్లోనే ఆటగాళ్ల ప్రతిభ తెలుస్తది:బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్య యాదవ్ 

నారాయణపేట, వెలుగు: గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు టోర్నమెంట్లు ఉపయోగపడుతాయని  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్య యాదవ్ అన్నారు. పేట మండలం పెరపల్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని సోమవారం ప్రారంభించారు. అంతకుముందు స్వామి వివేకానందా ఫొటోకు పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి డివిజన్‌‌ స్థాయికి చేరుకునేందుకు ఇలాంటి టోర్నీలు మరిన్న పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  నిర్వాహకులు సాయి, వెంకటేశ్, గ్రామ యువకులు పాల్గొన్నారు.