
ములుగు, వెలుగు : భారీ వర్షం కారణంగా ములుగు జిల్లాలో 16 మంది చనిపోయారని, వరదల్లో చిక్కుకున్న 52 మందిని పోలీస్, రెస్క్యూ టీం మెంబర్స్ రక్షించారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. 27 పునరావాస కేంద్రాల్లో 5,400ల మందికి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు తగ్గినా ముంపు ప్రాంతాలు పూర్తిగా కోలుకునే వరకు పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు, ములుగులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో ఆదివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్ ఆలం, జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎవరూ అదైర్యపడొద్దని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వరదలకు జిల్లాలో 52 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, 282 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 5 రోజులుగా నిరంతరం పనిచేస్తున్న కలెక్టర్, ఎస్పీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం, ఆఫీసర్లకు అభినందనలు తెలిపారు. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పస్రా – ఏటూరునాగారం, ములుగు – బుద్దారం రూట్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. బాధిత ప్రజలకు ఆహారం, నీరు, దుస్తులు అందించడంతో పాటు, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.