- ప్రమోషన్లు అడిగినమని.. ట్రాన్స్ ఫర్లు చేస్తున్నరు
- డైరీ రిలీజ్ కార్యక్రమంలో అగ్రి డాక్టర్స్ ఆవేదన
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ శాఖాధికారులు ఇన్నాళ్లూ తమ గుండెల్లో దాచుకున్న ఆవేదనను బయటపెట్టారు. ‘‘మా సంఘంపై ఎందుకీ వివక్ష ?’’ అంటూ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు ఎదుటే వాపోయారు. ‘‘అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని అడిగిన పాపానికి మమ్మల్ని వేధిస్తున్నారు. మాపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. మా సంఘానికి సపోర్ట్ చేసే వాళ్లను ట్రాన్స్‌ఫర్ పేరుతో బయటికి పంపిస్తున్నారు”అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ 317 జీవో పేరుతో 15 మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు..కానీ ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ ఫర్ల అంశాన్ని పక్కన పెట్టారు”అని అగ్రి డాక్టర్స్ చెప్పారు. మంగళవారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ సభలో సంఘం అధ్యక్షుడు రాజా రత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా సంఘాన్ని చిన్నచూపు చూస్తున్నందన నిరసన వ్యక్తం చేయడం కోసమే డైరీ రిలీజ్ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రిని, సెక్రటరీని ఆహ్వానించలేదు” అని అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ నాయకులు తేల్చి చెప్పారు. ‘‘మేం ప్రభుత్వ ఉద్యోగులం.. ఇచ్చిన టార్గెట్స్ అన్ని ఇన్ టైమ్ లో పూర్తి చేస్తున్నాం....వ్యవసాయ శాఖ సెక్రటరీ కానీ, మంత్రి కానీ మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి”అని కామెంట్ చేశారు. “సీఎం కేసీ ఆర్ వ్యవసాయ శాఖకు నిధులు ఇస్తున్నారు. కానీ డిపార్ట్మెంట్ లో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు”అని నేతలు ఆరోపించారు.
అధికారులపై వివక్ష సరికాదు : శ్రీనివాస్ గౌడ్
అగ్రి కల్చర్ డిపార్ట్మెంట్లో అధికారులపై వివ క్ష సరికాదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బాధలు చెప్తుంటే వినడానికే ఏదోలా ఉందన్నారు. చదువుకున్నోళ్లే వివక్ష చూపితే ఎలా అని, ఇదేం అనాగరికత? అని మంత్రి ప్రశ్నించారు.