భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసీఆర్ పాలనలో వరదలు వచ్చినప్పుడు .. పశువుల పరిహారం ఇవ్వలేదు.. మొదటి సారి పశువులకు సైతం పరిహారం ఇస్తున్నామన్నారు. గ్రామాల వారీగా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి.. బాధితులు అందరికీ నష్ట పరిహారం అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
ముందు మహబూబాద్ లో రెడ్ అలర్ట్ జోన్ లేదని.. ఆ తర్వాత ఊహించని విధంగా కుండపోతగా వర్షాలు పడ్డాయన్నారు. ప్రాణ నష్టాన్ని అరికట్టడంలో ప్రభుత్వం యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందన్నారు.వరద తాకిడికి రావిరాల గ్రామం నీట మునిగి.. ఆ గ్రామ ప్రజలు సర్వం కోల్పోయారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వాగులు. వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరద ముంపునకు నానిపోయిన ఇళ్లను ప్రభుత్వ అధికారులు గుర్తించి ఖాళీ చేయించాలని ఆదేశాలిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు.. ప్రత్యక్షంగా బాధితుల బాధలు విని.. దైర్యాన్ని కల్పించటం విశేషమని మంత్రి అన్నారు. వెంటనే ప్రాథమిక సాయం కింద సీఎం రూ . 5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారన్నారు. గ్రామాల్లో తాగు నీరు అందించి.. అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు,