కాంగ్రెస్​ ప్రభుత్వం రైతును రాజు చేస్తుంది: మంత్రి సీతక్క

కాంగ్రెస్​ ప్రభుత్వం రైతును రాజు చేస్తుంది: మంత్రి సీతక్క

కాంగ్రెస్​ ప్రభుత్వంలో.. సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్​ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు.  ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి రైతును రాజును చేశామన్నారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందన్నారు.  కొత్త విధివిధానాలు రూపొందించి త్వరలోనూ రూ. 15 వేలు రైతు భరోసా అందజేస్తామన్నారు. ఫసల్ బీమా యోజన పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకుంటుందని... సన్న వరి ధాన్యం సాగును ప్రోత్సహించే విధంగా క్వింటాకు రూ. 500 బోనస్​ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.  

రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ ..  రైతు సంక్షేమం కోసం  తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్   ఏర్పాటుకు  సీఎం రేవంత్​రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందన్నారు. ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. గౌరవించే కాంగ్రెస్​ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగాప్రయాణించే అవకాశాన్ని సీఎం రేవంత్​ రెడ్డి కల్పించారని.. ఇంకా నిరుపేదలకు కార్పొరేట్​ వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. 

తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి  తెలంగాణ విద్యా కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి.. అంగన్​ వాడీ సెంటర్​ లను  ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మిస్తామన్నారు.  మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.