- ముడి సరుకుల నుంచి ప్యాకింగ్ వరకు శుభ్రత పాటించాలి
- ఆహార పదార్థాల నాణ్యతపై ల్యాబ్రిపోర్ట్ పంపించాలి
- కొత్త యూనిట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ, కార్యాలయాన్ని మంత్రి సీతక్క సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్మాగారంలోని విభాగాలు, యంత్రాల పనితీరును మంత్రి పరిశీలించారు. టీజీ ఫుడ్స్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం సహా పలురకాల ఆహార పదార్థాలు సరఫరా అవుతాయి. ఈ పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను మంత్రి తనిఖీ చేశారు. ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్ నూ సందర్శించారు. బాలామృతం పౌడర్ నాణ్యతను పరిశీలించారు. అలాగే, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుద్ధిచేసిన ఆహార పదార్థాలను వెంటనే కవర్ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలు, స్టోరేజ్ పాత్రలపై మెష్ లు బిగించాలని అధికారులకు సూచించారు. ముడి సరుకుల నుంచి ప్యాకింగ్వరకు శుభ్రత పాటించాలన్నారు.
పదార్థాల శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
అంగన్వాడీలకు ఇక్కడి నుంచే ఫుడ్ సప్లై అవుతున్నందున.. చిన్నారుల భవిష్యత్ నుదృష్టిలో పెట్టుకుని శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై తనకు ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని సూచించారు. సాంకేతిక లోపంతో నెల రోజులుగా పనిచేయని స్నాక్ ఫుడ్ యూనిట్ మరమ్మతులకు ఎందుకు ఆలస్యం అవుతోందని అధికారులు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కొత్త యూనిట్లను సందర్శించారు.
కొత్త యూనిట్ పనులు పదేండ్లుగా పూర్తికాకపోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. యంత్రాలను త్వరగా బిగించి.. పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ వివరాలు, ఖర్చులు, సమస్యలు, ఉన్నత స్థాయి సిబ్బంది అర్హత, బిల్డింగ్, ఎంతకాలంగా టీజీ ఫుడ్స్ లో పని చేస్తున్నారు? ఏ స్థాయిలో పనిచేస్తున్నారనే సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే టీజీ ఫుడ్స్ పనితీరుపై సమీక్ష చేస్తానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంత్రి వెంట టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫాయిం, ఎండీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.