హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలకు మరిన్ని అంగన్ వాడీ సెంటర్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. ప్రస్తుతమున్న అంగన్ వాడీలను మరింత మెరుగుపరిచేందుకు ఆర్థిక చేయుతనివ్వాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్న పూర్ణాదేవి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, సవాళ్లను రాష్ర్ట మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియెట్ నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లో 14,83,940 మంది చిన్నారులకు, 3,45,458 మంది గర్భిణులకు, బాలింతలకు సేవలందిస్తున్నం. 3,989 మినీ అంగన్ వాడీలను మెయిన్ అంగన్ వాడీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేశాం.
అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాస్‌లను త్వరలో ప్రారంభించాలని నిర్ణయించాం. ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ పూర్తి చేశాం. అంగన్ వాడీ టీచర్లకు నెలకు రూ. 13,650, ఆయాలకు రూ.7,800 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. కిషోర బాలికల్లో రక్త హీనత తగ్గించడానికి రాగి లడ్డూలను ప్రయోగాత్మంగా మూడు జిల్లాలో ప్రారంభించాం. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జూలైలో 2,755 మంది పిల్లలను కాపాడాం’’ అని కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా కొత్త అంగన్ వాడీ సెంటర్ల మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మలక్‌పేట ఘటన జరగలేదని నేను అనలేదు
మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ బాలికల హస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. అధికారులిచ్చిన సమాచారాన్నిమాత్రమే తాను ప్రస్తావించానని తెలిపారు. తన మాటలను వక్రీకరించవద్దన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల బాధ్యతగా వ్యహరించాలని కోరారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యహరిస్తోందని వెల్లడించారు. కేసు పురోగతిని తెలియజేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు తెలిపారు. అంధబాలికపై లైంగిక దాడి కేసుపై మంత్రి సీతక్క శనివారం సెక్రటేరియెట్‌లో రివ్యూ చేశారు. కేసు పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణ త్వరిగా పూర్తిచేసి నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలను, వేధింపులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని, కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.