నేనూ ఆదివాసీ బిడ్డనే! .. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం: మంత్రి సీతక్క

నేనూ ఆదివాసీ బిడ్డనే! ..  దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం: మంత్రి సీతక్క
  • మహిళా మంత్రిగా నాపైనే బాధ్యత ఎక్కువ
  • నిందితుడిపై అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేశాం
  • తక్షణ సాయం కింద రూ. లక్ష ఇస్తే తప్పు పడతారా?
  • మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క


హైదరాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటోడ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళ కేసులో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. కాగా విపక్ష నేతల విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసీ ఆడబిడ్డనేనని, అలాగే మహిళా మంత్రిగా తనపై మరింత ఎక్కువ బాధ్యత ఉందని వెల్లడించారు. ఆదివాసీ ఆడబిడ్డపై దాడి జరిగిందని తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తుచేశారు. బాధితురాలికి అండగా నిలిచామని వివరించారు. 

దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని, దోషులకు కఠినంగా శిక్షపడేలా చేయడం తమ బాధ్యత అన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తక్షణ సాయం కింద రూ. లక్ష ఇస్తే దాన్ని కూడా తప్పు పడతారా? అని మండిపడ్డారు. దాడికి మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, మతకొట్లాటలు జరిగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా గాయపడిన ఆదివాసీ మహిళకు గాంధీ ఆస్పత్రిలో రూ. లక్ష చెక్కు అందజేసిన సీతక్క, వైద్యులను చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.