- నాసిరకం ఎగ్స్ ను తిరస్కరించాలి
- నాణ్యతలోపిసే కాంట్రాక్టర్లపై చర్యలు
- అంగన్ వాడీల్లో నాణ్యమైన భోజనం అందించాలి
- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్: అంగన్ వాడీ కేంద్రాల్లో క్వాలిటీ చెకింగ్ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇవాళ సెక్రటేరియట్ లో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాల వారు నాణ్యతలేని వస్తువులను, గుడ్లను తిరస్కరించాలని అన్నారు. లేని పక్షంలో సంబంధిత అంగన్ వాడీ కార్యకర్తను, స్థానిక అధికారులను బాధ్యులను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టుల గడువు తగ్గించే యోచనలో ఉన్నామని చెప్పారు. అంగన్వాదీ కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేస్తే వాటిని తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని అన్నారు.